పవన్ నా బుగ్గ గిల్లి ముద్దుపెట్టారు!
on May 17, 2021
కొరియోగ్రాఫర్ గా 1400కి పైగా సినిమాలకు పని చేసిన శివశంకర్ మాస్టర్ తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మద్రాస్ లో పుట్టిన ఆయన.. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి నాటి తరం అగ్ర హీరోల సినిమాలతో పాటు ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి నేటి తరం హీరోల సినిమాలకు కూడా పని చేశారు. ఓ వైపు కొరియోగ్రాఫర్ గా సినిమాలు చేస్తూనే.. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరించారు. అలానే నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివశంకర్ మాస్టర్ 'అత్తారింటికి దారేది' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని.. ఆయన చాలా మంచి వ్యక్తి అంటూ కొనియాడారు శివశంకర్ మాస్టర్. అందరికీ సాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. ఆయన నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాకి తాను పనిచేశానని తెలిపారు.
ఈ సినిమాలో 'దేవదేవం' అనే పాటకు తాను కొరియోగ్రఫీ చేశానని శివశంకర్ చెప్పారు. తనను సెట్స్ పై చూడగానే పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారంటూ హగ్ చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసే సమయంలో పవన్ తన బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నారని.. "ఎంత బాగా చేస్తున్నారు మాస్టర్" అంటూ తనను మెచ్చుకున్నారని శివశంకర్ మాస్టర్ అన్నారు. నటుడిగా కంటే పవన్ వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టమని శివశంకర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
